పేరులో సింహం…బుద్దిలో న‌క్క‌

నచ్చితే షేర్ చేయ్యండి

కుక్క తోక‌…న‌క్క బుద్ది ఎప్పుడూ మార‌దు. మార్చాల‌నే ప్ర‌య‌త్నం కూడా వృధానే. పేరులో ఉండే ఠీవీ, ప్ర‌వ‌ర్త‌న‌లో ఉండ‌దు. వ‌య‌సు మీద ప‌డ్డా కొంద‌రికి మ‌ర్యాద అనే ప‌దానికి అర్థం తెలియ‌దు. స్పోర్ట్స్‌మ్యాన్‌కి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం…స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించ‌డం. ఇలాంటి ల‌క్ష‌ణం లేకుండా ఇవాళ‌…శ్రీలంక క్రికెట్ టీమ్ ప్ర‌ద‌ర్శించ‌న తీరు, స‌గ‌టు అభిమానిని మాత్ర‌మే కాదు, క్రికెట్ లోకాన్ని విస్తుపొయేలా చేసింది. సోష‌ల్ మీడియాలో శ్రీలంక క్రికెట్ టీమ్ ఆడిన దిగ‌జారుడు ఆట ఆ దేశాన్ని అభాసుపాల‌య్యేలా చేసింది.

మ‌రీ అంత సీన్ ఉందా…?

ఢిల్లీలో కాలుష్యం కామ‌న్‌. ఇటీవ‌ల‌, అక్క‌డి ప్ర‌భుత్వం చాలా ఏర్పాట్లు చేసింది. అయితే, తీవ్ర‌త మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి చోట‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ‌రికొన్ని దేశాల ఆట‌గాళ్లు ఇబ్బంది ప‌డ్డారంటే కాస్త అర్థం ఉంది. అలాగ‌ని, శ్రీలంక ప్లేయ‌ర్స్ వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డాల‌ని లేదు. కానీ, ఆన్ ద ఫీల్డ్‌లో ఉన్న ప్లేయ‌ర్స్‌తో పాటు, ఆఫ్ ద ఫీల్డ్‌లోని స‌బ్‌స్టిట్యూట్స్ అంద‌రూ ఒకే తీరు, వామ్మో కాలుష్యమంటూ ముఖానికి మాస్క్‌లు వేసుకోవ‌డం నిజంగా క్ష‌మించ‌రాని నేర‌మే. కోహ్లీ కుమ్ముడిని త‌ట్టుకోలేక‌, కాలుష్యం పేరుతో క‌ల్ల‌బొల్లి మాటలు చెప్పి, ఆడిన హైడ్రామాగానే క‌నిపించింది కూడా.

చండీమాల్ చెప్పిన క‌థ‌

మూడో టెస్ట్ తొలిరోజు నుంచే టీమిండియా డామినేష‌న్ పూర్తిగా క‌న‌ప‌ర్చింది. కోహ్లీ బ్యాట్‌కు అలుపు అన్న‌దే లేకుండా పోయింది. రెండో రోజు ట్రిపుల్ సెంచ‌రీ చేసేలా కూడా క‌నిపించాడు. అయితే, ఈ దూకుడిని ఎలా అడ్డుకోవాలో తెలియ‌క‌, వ‌రుస‌గా లంక ప్లేయ‌ర్స్ కాలుష్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు ప‌దే ప‌దే అంపైర్ల‌ను సంప్ర‌దించారు. చివ‌రికి, మ‌న హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి కూడా సీన్‌లోకి వ‌చ్చేలా చేశారు. అంతేకాదు, లంక మేనేజ‌ర్ అంపైర్ల ద‌గ్గ‌రికి వ‌చ్చి, బాబు, మా ద‌గ్గ‌ర ఎక్స్‌ట్రా ఫీల్డ‌ర్లు కూడా లేరు, ఆట‌ను ఆపేయండ‌ని చెప్పేశాడు. కెప్టెన్ చండీమాల్‌, ప్లేయ‌ర్స్‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ, ఈ సిచ్యువేష‌న్‌కు ఎంక‌రేజ్ చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసేదే.

కోపంతో ఇన్నింగ్స్ డిక్లేర్‌

చండీమాల్ అండ్ కో చేసిన హ‌డావుడి, ఓవ‌ర్‌ యాక్ష‌న్‌కి ఫుల్‌గా చిర్రెత్తుకొచ్చిన కోహ్లీ, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రెస్ట్‌తీసుకోండి, మేము ఫీల్డింగ్ చేస్తామ‌ని తేల్చిచెప్పేశాడు. లంక ప్లేయ‌ర్స్ డ‌గౌట్‌కి చేరాకా..మ‌న ఆట‌గాళ్లు దాదాపు 45ఓవ‌ర్లు ఫీల్డింగ్ చేసినా ఎలాంటి అసౌక‌ర్యానికి గురికాలేదు. మ‌న వాతావ‌ర‌ణం మ‌న‌కు అల‌వాటే అయినా….జ‌ట్టులో ఉన్న‌వాళ్లంద‌రూ ఢిల్లీ వాళ్లు కాదు కాబ‌ట్టి వాళ్ల‌కి వాతావ‌ర‌ణం కొత్తే.

పేరులో సింహం ఉన్న శ్రీలంక జ‌ట్టు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఢిల్లీ క్రికెట్ ఆడేంద‌కు అనువైన స్థ‌లం కాద‌నేలా సంకేతాలు ఇచ్చింది. కామెంట్రీ టైమ్‌లో సంజ‌య్ మంజ్రేక‌ర్‌, హ‌ర్షాబొగ్లే లాంటి ఎన‌లిస్ట్‌లు కూడా ఇలాంటి కామెంట్స్ చేయ‌డం బ‌ట్టి వారి తీరును అర్థం చేసుకోవ‌చ్చు. ఇవి, వాళ్ల‌ను ఆట‌లో కాసేపు ఆధిక్యంలో నిలుపుతాయోమే కానీ, క్రీడాస్ఫూర్తి విష‌యంలో మాత్రం వాళ్లు అట్ట‌డుగు స్థాయికి దిగ‌జారిపోయారు. అంతేకాదు,
మేము సింహాలు కాదు….న‌క్క‌లం, మా బుద్ది ఇంతేన‌ని తేల్చిచెప్పేశారు.

వెంకట్ రేగ‌ళ్ల‌
సీనియ‌ర్ స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్‌
న్యూస్‌టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts