నాన్నకి ప్రేమతో….తండ్రి మరణించిన రెండోరోజే ఫీల్డ్ లోకి.. హాఫ్ సెంచరీ

నచ్చితే షేర్ చేయ్యండి

స‌చిన్‌.. క్రికెట్ లెజెండ్‌..! విరాట్‌కొహ్లీ.. వాల్డ్‌క్రికెట్ సూప‌ర్‌స్టార్‌..! గ‌తంలో ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌కు ఓకే త‌ర‌హా విషాద అనుభ‌వం. ఆట మ‌ధ్య‌లో తండ్రి చ‌నిపోయాడ‌నే వార్త‌..ఈ ఇద్ద‌రి జీవితాల్లో అత్యంత క్లిష్ట‌ప‌రిస్థితులు. ఐనా క్రికెట్ ప‌ట్ల వారికున్న ప్రేమ‌.. వృత్తిప‌ట్ల అంకిత‌భావం.. ఆ శోకాన్ని మ‌రిపించ‌ట‌మే కాదు..వారిని మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు తీసుకెళ్లింది. అచ్చం అలాంటి సిచువేష‌నే.. మ‌ళ్లీ ఐపీఎల్‌-10లో పున‌రావృత‌మైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ రిష‌బ్ పంత్ తండ్రి.. మ్యాచ్‌కు 2 రోజుల ముందు మ‌ర‌ణించాడు.

ఓ వైపు క‌న్న‌తండ్రి క‌న్నుమూశాడు. త‌న‌ను పెంచి పెద్ద‌చేసి.. ఉన్న‌త‌స్థానానికి చేర్చిన‌ నాన్న‌తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయాడు. ఇలాంటి క్లిష్ట స‌మయాల్లో ఏ కొడుకైనా కుప్ప‌కూలిపోతాడు. ఎంతటి మ‌నోధైర్య‌మున్న వాడైనా.. క‌న్నీటిలో కూరుకుపోతాడు. కానీ రిష‌బ్ పంత్ మాత్రం.. త‌న్నుకొస్తున్న క‌న్నీళ్లు దిగ‌మింగుకొని.. హృద‌యాన్ని బండరాయిచి చేసుకొని.. మ‌ళ్లీ క్రికెట్ ఆడాడు. ఆడ‌ట‌మంటే మొక్కుబ‌డిగా ఆడ‌టం కాదు.. టీం కోసం అనుక్ష‌ణం పోరాడాడు. బెంగ‌ళూర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రి మ‌న‌సుల‌నూ కొల్ల‌గొట్లాడు. 36 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై విరుచుకుప‌డ్డాడు. త‌న జ‌ట్టుని గెలిపించేందుకు అన్నిర‌కాలుగా ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం లేక‌పోయింది. చివ‌ర్లో మిశ్రా బంతుల‌ను వృథా చేయ‌కుండా.. పంత్‌కు స్ట్ర‌క్ ఇచ్చిఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది. మ్యాచ్ అనంత‌రం.. తండ్రి చ‌నిపోయిన బాధ కంటే.. మ్యాచ్‌ను గెలిపించ‌లేకపోయాన‌న్న బాధే పంత్ ముఖంలో క‌న‌బ‌డింది.

మూడు రోజుల క్రితం రిష‌బ్ పంత్ తండ్రి మ‌ర‌ణించాడు. దీంతో హుటాహుటిన ఇంటికి వెళ్లిపోయాడు. తండ్రి చ‌నిపోవ‌టంతో కొన్ని రోజుల పాటు ఐపీఎల్‌మ్యాచ్‌ల‌కు దూరమ‌వుతాడ‌ని అంతా అనుకున్నారు. కానీ తండ్రికి అంత్య‌క్రియ‌లు పూర్తైన వెంట‌నే.. తిరిగి డేర్‌డెవిల్స్ జ‌ట్టులో చేరిపోయాడు. చిన్న‌వ‌య‌సులో పంత్‌కు వ‌చ్చిన క‌ష్టాల‌ను చూసి డ్రెస్సింగ్‌రూంలో టీం స‌భ్యులంతా కంట‌త‌డిపెట్టారు. కానీ క్రికెట్ ప‌ట్ల అత‌ని నిబ‌ద్థ‌త‌ను చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర్వాత బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న చూసి.. షాక‌య్యారు. అంత‌టి బాధ‌లోనూ అత‌ని ఆట తీరు చూసి.. మ‌న‌సులో సెల్యూట్ చేశారు.వృత్తిప‌ట్ల పంత్‌కు ఉన్నఅంకిత భావం.. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. గ‌తంలో ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర్కొన్న స‌చిన్ క్రికెట్ లెజెండ‌య్యాడు. విరాట్ కొహ్లీ వాల్డ్ క్రికెట్ స్టార్‌గా కొన‌సాగుతున్నాడు. భ‌విష్య‌త్‌లో పంత్ కూడా క్రికెట్‌లో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుతాడ‌ని.. భార‌త ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటుతాడ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా హాట్సాఫ్ టూ రిష‌బ్ పంత్‌..!


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts