వీళ్లిద్ద‌రూ కొట్టుకునుడే త‌క్కువ‌…!

నచ్చితే షేర్ చేయ్యండి

భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో పరస్పర ఆరోపణలు.. వాగ్వాదాలు.. హేళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరు టెస్టులో తలెత్తిన ‘డీఆర్‌ఎస్‌’ వివాదం తర్వాత ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లను పిలిచి సంయమనంతో వ్యవహరించాలని సూచించినప్పటికీ.. రాంచీ టెస్టులో వివాదాలు ఆగలేదు. ఈ మ్యాచ్‌లో కోహ్లి గాయపడటంపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎగతాళిగా సంజ్ఞలు చేయడం.. కోహ్లి కూడా వారికి అదే తీరులో సమాధానం చెప్పడం తెలిసిందే.

ఈ గొడవ మైదానాన్ని దాటి విలేకరుల సమావేశం వరకూ వెళ్లింది. తన భుజం గాయానికి చికిత్స చేసిన జట్టు ఫిజియో పాట్రిక్‌ ఫర్హర్ట్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు హేళన చేశారని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరోపించాడు. ‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురైదుగురు అదే పనిగా పాట్రిక్‌ పేరు ఎత్తడం గమనించాను. అలా ఎందుకో తెలియదు. అతను మా ఫిజియో. నాకు చికిత్స చేయడం అతడి బాధ్యత. మరి వాళ్లెందుకు అతడిని లక్ష్యంగా చేసుకున్నారో తెలియదు’’ అని విలేకరులతో కోహ్లి అన్నాడు. కోహ్లి గాయంపై మ్యాక్స్‌వెల్‌ ఎగతాళిగా సంజ్ఞ చేయగా.

దానికి బదులుగా వార్నర్‌ ఔటైనపుడు కోహ్లి అదే తరహాలో వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో ఒక ఆస్ట్రేలియా విలేకరి ప్రస్తావించగా.. ‘‘మా వాళ్లందరూ క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలడుగుతుంటే.. మీరు మాత్రం వివాదాస్పద అంశంపై అడుగుతున్నారే. అలాంటివి మైదానంలో సహజం’’ అని కోహ్లి చెప్పాడు. రాంచీ టెస్టు తొలి రోజు కోహ్లికి గాయమైన సమయంలో పాట్రిక్‌ పరుగు పరుగున మైదానానికి వచ్చి అతడికి చికిత్స అందించాడు.

విరాట్‌ అతడి వెంటే మైదానాన్ని వీడాడు. తమ దేశస్థుడే అయిన పాట్రిక్‌.. కోహ్లి విషయంలో అంత శ్రద్ధ చూపడం ఆసీస్‌ ఆటగాళ్లకు నచ్చక అతడి గురించి హేళనగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఐతే కోహ్లి ఆరోపణల్ని ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తీవ్రంగా ఖండించాడు. ‘‘ఈ ఆరోపణలు నిరాశ కలిగించాయి. అలాంటిదేమీ జరగలేదు. మేం పాట్రిక్‌ను అగౌరవపరిచామని కోహ్లి అంటున్నాడు. కానీ దానికి పూర్తి భిన్నంగా మేం వ్యవహరించామని నేనంటున్నా.

పాట్రిక్‌.. భుజం గాయానికి గురైన కోహ్లి వేగంగా కోలుకుని మైదానంలోకి తిరిగొచ్చేలా చూశాడు. అతను తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు’’ అని స్మిత్‌ అన్నాడు. కోహ్లి గాయంపై ఎగతాళి చేయడం ద్వారా ఆసీస్‌ ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని దెబ్బ తీశారని వస్తున్న ఆరోపణలపై స్మిత్‌ స్పందిస్తూ.. ‘‘భారత్‌తో మేం టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నపుడు కొంచెం ఉత్కంఠ ఉంటుంది. పోటీ పోటీగా ఆడతాం. ఐతే క్రీడా స్ఫూర్తి విషయంలో ఇబ్బందేమీ లేదు. సరైన స్ఫూర్తితోనే మ్యాచ్‌ సాగింది’’ అని చెప్పాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts