ఇంకెన్నాళ్లీ కుమ్ములాట‌లు….???

నచ్చితే షేర్ చేయ్యండి

స‌రిగ్గా 17రోజుల క్రితం…హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ తెలంగాణ టీట్వంటీ లీగ్‌ను ప్ర‌క‌టించిన సంద‌ర్భం ఇంకా నాకు బాగా గుర్తు. చాలా కాలంగా క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ తెలంగాణ‌, తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్…రూర‌ల్ హంట్ పేరుతో గ్రామీణ క్రీడ‌కు ఊపిరి అందిస్తున్న వేళ‌, ఈ లీగ్ చాలా స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌ల‌తో పాటు, ఎట్ట‌కేల‌కు హెచ్‌సీఏ గ్రామాల్లోకి వ‌చ్చింద‌నే కేటీఆర్ మాట‌లు…తెలంగాణ టీట్వంటీ లీగ్ ప్ర‌త్యేక‌త‌ను అంద‌రికి తెలియ‌జేశాయి.

ఆరుగురు స‌భ్యుల మ‌ధ్యే ఐక్య‌త లేదా…?

మారిన నిబంధ‌న‌ల‌తో హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో స‌భ్యుల సంఖ్య ఆరుకు త‌గ్గింది. ఇందులో…ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రీ, ట్రెజ‌ర‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు స‌భ్యులున్నారు. అయితే, వీళ్ల మ‌ధ్యే ఐక్య‌త లేద‌నేది ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రీ వ్య‌వ‌హ‌రంతో తేలిపోయింది. ఏకంగా సెక్ర‌ట‌రీపై వేటు వేయాల‌ని అధ్య‌క్షుడు, అంబుడ్స్‌మ‌న్‌కు సిఫార‌సు చేయ‌డం బ‌ట్టి, హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో గ‌తేడాదిగా ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

అప్పుడు ఒప్పు…ఇప్పుడు త‌ప్పు..

ప్ర‌స్తుత వ్య‌వ‌హ‌ర‌మంతా…క్రికెట్‌ను ర‌క్షించుకోవాల‌నే, హెచ్‌సీఏను ముందుకు తీసుకెళ్లాల‌నో ఉద్దేశంతో జ‌రిగితే ఏ గొడ‌వ ఉండ‌దు. ప‌వ‌ర్ అనే పాయింట్ దిశ‌గా…ఆడుతున్న గేమ్‌లాగే ఇది క‌నిపిస్తుంది. సుప్రీం కోర్ట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం, లోథా క‌మిటీ సిఫార‌సులు ప్ర‌కారం, అధ్య‌క్ష ప‌దవికి జి. వివేకానంద అర్హుడు కాద‌ని సెక్ర‌ట‌రీ చెబుతున్నాడు. ఆయ‌న ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఉంటూ, క్రికెట్ పాల‌న‌లో ఎలా ఉంటార‌ని ప్ర‌శ్నిస్తున్నాడు. అయితే, ఆయ‌న ఎన్నిక‌ల్లో పాల్గొనే స‌మ‌యంలో కూడా ఈ హోదాలోనే ఉన్నాడు. అప్పుడు క‌నిపించ‌ని నిజం, ఇప్పుడెలా క‌నిపించింద‌నేది అస‌లు ప్ర‌శ్న‌.

అప్ప‌ట్లో ఫ్రెండ్‌…ఇప్పుడు బ్యాండ్‌

అర్ష‌ద్ ఆయూబ్ అండ్ కో పై వివేక్ ప్యానెల్ ఫైట్ చేసిన‌ప్పుడు శేషునారాయ‌న్ కీలకంగా వ్య‌వ‌హ‌రించాడు. కోర్ట్‌లో కేసులు వేయ‌డంతో పాటు, సాక్ష్యాధారాలు సంపాదించ‌డంలో శేషు నారాయ‌ణ పాత్ర చాలా కీల‌క‌మ‌నేద‌నే చెప్పాలి. మీడియాలో, హెచ్‌సీఏ అవినీతి వ్య‌వ‌హ‌రానికి విస్తృత ప్ర‌చారం క‌ల్గించ‌డంలో కూడా ఆయ‌నే చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాడ‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌సరం లేదు. అలాంటి శేషునారాయ‌ణ‌, సెక్ర‌ట‌రీగా ఏక‌గ్రీవంగా గెల‌వ‌డం, ఇప్పుడు ఆయ‌న అవినీతికి పాల్ప‌డుతున్నాడ‌ని అధ్య‌క్షుడు చెబుతుండ‌టం హాట్‌టాపిక్‌గా మారింది.

ఇప్ప‌టికే, భారీ కుంభ‌కోణంతో మ‌న క్రికెట్ భ‌విష్య‌త్ అంధ‌కారంలోకి నెట్ట‌డ‌మే కాకుండా….సుప్రీం కోర్ట్ లాంటి అత్యున్న‌త న్యాయ‌స్థానం చేత చీవాట్లు తిన్న ఘ‌న‌త మ‌న‌ హెచ్‌సీఏ సొంతం. ఇప్పుడు ఈ వ్య‌వ‌హ‌రంతో మ‌రోసారి వార్త‌ల్లోకి నెట్టింది. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ త‌ర్వాత‌…ఒక్క ప్లేయ‌ర్ కూడా రాష్ట్రం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌లేక‌పోయాడంటే పాల‌న‌, కోచింగ్ ఏ విధంగా సాగుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాదు, మార్పు మొద‌లైంద‌నే మాట వెనుక‌, మ‌నీ ఆలోచ‌న‌లున్నాయ‌నే ఉహ‌గానాల‌కు ఊత‌మిచ్చిన‌ట్టు చెప్పొచ్చు.

ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల ప్ర‌యోజ‌నాలు

నిజానికి…హెచ్‌సీఏ సెక్ర‌ట‌రీపై వేటు, రేప‌టి నుంచి ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లకు అవ‌కాశం ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహాం లేదు. ఇప్ప‌టికే, వివేక్ అండ్ కో చేసిన ప‌నిపై, కౌంట‌ర్ ఇచ్చేందుకు శేష‌నారాయ‌ణ్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆయ‌న శ‌నివారం జ‌ర‌గ‌బోయే ప్రెస్‌మీట్‌లో ఏం చెబుతాడ‌నేది కీల‌కంగా మారింది. మ‌రోవైపు, అంబుడ్స్‌మ‌న్ రిపోర్ట్ కూడా ఇంట్ర‌స్ట్‌ను పెంచుతుంది. అయితే, ఈ వ్య‌వ‌హ‌ర‌మంతా, కాసేపు బ్రేకింగ్ న్యూస్‌లుగా, మార్నింగ్ హెడ్‌లైన్స్‌గా, వేరే అసోసియేష‌న్ల కాల‌క్షేప ముచ్చ‌ట్లుగా ఉంటుంది త‌ప్ప‌, తెలంగాణ క్రికెట్‌ను ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ల‌లేవు. ఈ వ్య‌వ‌హ‌రంలో రాష్ట్ర ప్ర‌భుత్వ జోక్యం అవ‌స‌ర‌మ‌నే చాలా మంది వాద‌న‌కు ఇప్పుడు మ‌రిన్ని గొంతులు తోడ‌య్యాయి. ఏదీ ఏమైనా ఇలాంటి కుమ్ములాట‌ల‌తో కాకుండా…ఆన్ ద ఫీల్డ్‌లో బ్యాట్, బంతికి మ‌ధ్య జ‌రిగే కొట్లాట‌తో తెలంగాణ నుంచి మ‌రో క్రికెట‌ర్ దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే ప‌రిస్థితికి మారాల‌ని ఆశిద్దాం.

వెంక‌ట్ రేగ‌ళ్ల‌
స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts