గోపి గీసిన బొమ్మ!

నచ్చితే షేర్ చేయ్యండి

మన భారతీయ సంప్రదాయాల్లో ప్రధానమైనది, ప్రత్యేకమైనది గురుశిష్య పరంపర. గురుకులాలు కనుమరుగైనా ఇప్పటికీ అన్ని రంగాల్లో మనకు ఆ సంప్రదాయం కనిపిస్తూనే ఉంటుంది, ముఖ్యంగా క్రీడారంగంలో. కేంద్ర ప్రభుత్వం కూడా ఆటగాళ్ళకు ఇచ్చే అత్యున్నత అవార్డుకు ‘ అర్జున ‘ అని, కోచ్ కిచ్చే అవార్డుకు ‘ద్రోణాచార్య ‘ అని సరైన నామకరణం చేసింది. అలాంటి ఒక ‘అర్జున ‘ గ్రహీత పి.వి.సింధు, ఒక ‘ద్రోణాచార్య ‘ పుల్లెల గోపీచంద్ కలిసి రియో ఒలింపిక్స్‌లో మనం తలెత్తుకునేలాగ చేశారు. ఈ జోడీ తెచ్చిన వెండి పతకంతో రియో వరస వైఫల్యాల వల్ల వాడిపోయి ఉన్న మన ముఖాల్లో మళ్ళీ వెన్నెలలు వెల్లివిరిశాయి.

ఫి.టి ఉష లాంటి పరుగుల రాణిని మనకందించిన ఘనత ఆమె కోచ్ నంబియార్‌కు దక్కుతుంది. సింధు విషయంలో గోపీచంద్ పాత్ర కూడా అలాంటిదే. సైనా నెహ్వాల్ కూడా గోపీచంద్ శిష్యురాలే కానీ ఆమెకు మొదట్లో వేరే కోచ్‌లుండేవారు, ఒక స్థాయికి వచ్చిన తరువాతనే ఆమె గోపి శిష్యరికం చేసింది. రెండేళ్ళ క్రితం నుంచి ఆమె బెంగళూరులో విమల్ కుమార్ దగ్గర కోచింగ్ తీసుకుంటుంటడం కూడా మనకు తెలుసు. కానీ సింధు అలా కాదు తన ఎనిమిదో ఏటి నుంచి గోపిచంద్ శిక్షణలోనే ఓనమాలు దిద్దుకుంది. బాపు బొమ్మ లాగ ఆమె గోపి గీసిన బొమ్మ. అతను విసిరిన ఆరడుగుల రాకెట్టు.

సింధు తలిదండ్రులిద్దరూ వాలీబాల్ ప్లేయర్లు. తండ్రి రమణ అంతర్జాతీయ స్థాయిలో రాణించి అర్జున్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. తల్లి విజయ కూడా జాతీయ స్థాయి క్రీడాకారిణి. సింధు కూడా పొడగరి కాబట్టి ఆమె న్యాయంగా వాలీబాల్‌నే ఎంచుకోవాలి. కానీ 2001లో గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించినపుడు రమణ ఆ దృశ్యాలు టీవీలో చూపించి ఆ విజయం తాలూకు గొప్పతనాన్ని కూతురికి చెప్పాడు. చిన్నారి సింధుపై ఆ ప్రభావం పడింది. వాలీబాల్ కాకుండా బ్యాడ్మింటనే ఇష్టపడింది. గోపి, రమణ మంచి మిత్రులు. అర్జున అవార్డు కూడా ఒకేసారి అందుకున్నారు. 2004 నాటికి గోపి తన కోచింగ్ అకాడెమీ నెలకొల్పి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. సింధులోని సహజమైన టాలెంట్‌ను అతను ముందుగానే గుర్తించి ఆమెను ఓ ఛాంపియన్‌గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాడు. సింధు కూడా పట్టుదలగా సాధన చేసేది. సింధు ఇంటికి, గొపి అకాడెమీ కి మధ్య ముప్పై కిలోమీటర్లపైనే దూరం ఉండేది. అయినా రోజూ పొద్దున్న, సాయంత్రం వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి ప్రాక్టీసు హాజరయ్యేది. ఏరోజైనా తండ్రికి వీలు పడక అకాడెమీకి తీసుకెళ్ళకపోతే ఏడ్చి మరీ సాధించుకునేది.

పన్నెండేళ్ళ గోపి శిష్యరికంలో సింధు జూనియర్, సీనియర్ స్థాయిలో అనేక ఘన విజయాలు సాధించింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. అయితే తనకున్న అద్వితీయమైన టాలెంట్‌కు పూర్తి న్యాయం చేయలేకపోయింది. అందుకే ఈసారి ఒలింపిక్స్ ముందు గోపీ ఆమెపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. మూడు నెలల క్రితమే ఆమె సెల్‌ఫోన్ లాగేసుకున్నాడు. ఆమెకిష్టమైన బిర్యాని, చాకొలెట్లు, మైసూర్ పాక్ అన్నీ బంద్! ఫిట్‌నెస్ మెరుగుపరచడానికి ఇద్దరు ట్రైనర్లను నియోగించాడు. బయట మృదుభాషిగా కనిపిస్తాడు గానీ కోచ్‌గా మాత్రం గోపి చాల కఠినంగా ఉంటాడు. తాను కూడా ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుని ఏడు కేజీల బరువు తగ్గాడు. సింధుకు స్వయంగా ప్రాక్టీసు పార్టనరయ్యాడు. సింధు మెతకగా కనిపిస్తున్నదని షాట్లు కొట్టేడప్పుడు అరవడం నేర్పించాడు. గోపి కృషి,సింధు పట్టుదల తాలూకు ఫలితాలు మనకు ఒలింపిక్స్‌లో కనిపించాయి. నంబర్ టు తో సహా తనకన్న ప్రపంచ ర్యాంకింగుల్లో ముందున్న ముగ్గురమ్మాయిలని చిత్తు చేసి సింధు రన్నరప్ గా నిలిచింది. ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర పుటలకెక్కింది. కంగ్రాట్స్ సింధు అంద్ గోపి!ఈ గురుశిష్య పరంపర ఇలాగే కొనసాగించి వచ్చేసారి బంగారం పట్టుకురండి.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts