ఏ కులము నీదంటే…

నచ్చితే షేర్ చేయ్యండి

ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధు కులం ఏంటని బోలెడంతమంది ఇంటర్నెట్‌లో వెతికేశారంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ఘాటైన స్పందనలు కూడా వచ్చాయి. ఈ రోజుల్లో కూడా ఇంకా కులం గురించి అంత కుతూహలం ఎందుకని మోడరన్ మేధావులు, అభ్యుదయ వాదులు తెగ బాధపడిపోయారు. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎదుటివాడి కులం తెలుసుకోవాలన్న కుతూహలం మనందరిలోను ఉంటుందనేది ఓ నగ్న సత్యం. గొప్ప గొప్ప మేధావులు సైతం కొత్తగా పరిచయమైన వాళ్ళ ఇంటిపేరు అడిగి తద్వారా వారి కులం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారి వారి కులాలను బట్టి వ్యక్తుల ప్రవర్తనను, లక్షణాలను అంచనా వేయడం మనసమాజంలో ప్రతి ఒక్కరికి సంక్రమించిన అంటువ్యాధి. అలాగే ప్రముఖ వ్యక్తుల కులాలు తెలుసుకోవాలన్న కుతూహలం కూడా మనకెప్పుడూ ఉంటూనే ఉంటుంది. నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ కులాలేవో మనలో చాలమందికి తెలుసు. మరి పైకి మాత్రం కులతత్వాన్ని ఈసడించుకుంటూ మనమెందుకు హిపోక్రసీ ప్రదర్శిస్తున్నాం?

క్రీడాకారుల విషయంలో వారి సామాజిక నేపధ్యం తెలుసుకోవడం కొన్నిసార్లు అవసరం కూడా. క్రీడాకారులు ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి, ఏయే సామాజిక వర్గాలనుంచి వస్తున్నరనేది తెలుసుకోవడం శాస్త్రీయమైన అధ్యయనమే. ఆయా క్రీడల్లోని ధోరణులు అర్థం చేసుకోడానికి ఇలాంటి అవగాహన ఉపయోగపడుతుంది. ఓ దశాబ్దంన్నర క్రితం సిరియవాన్ ఆనంద్ అనే సామాజిక శాస్త్రవేత్త రాసిన పుస్తకం “బ్రాహ్మన్స్ అండ్ క్రికెట్” పెద్ద సంచలనమే రేపింది. దేశ జనాభాలో నాలుగు శాతమే ఉన్నప్పటికీ భారత క్రికెట్ జట్టులో మాత్రం బ్రాహ్మణులదే ఆధిపత్యంగా ఉందని అతను ఆ పుస్తకంలో రాశాడు.అప్పట్లో భారత జట్టులో దాదాపు ఏడెనిమిదిమంది బ్రాహ్మణ ఆటగాళ్ళే ఉండడాన్ని ఆనంద్ ఉదహరించాడు. నిజంగానే అప్పటి క్రికెట్ జట్టులోని సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్,కుంబ్లే, శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అగార్కర్  లాంటివారంతా బ్రాహ్మణులే. అంతకు ముందు తరం ప్రముఖులు గవాస్కర్, విశ్వనాథ్, వెంగ్సర్కార్, రవి శాస్త్రి, ప్రసన్న, చంద్రశేఖర్, వెంకటరాఘవన్ కూడా ఆ కులస్తులే. క్రికెట్‌కు పెద్దగా శారీరక దారుఢ్యం అవసరం లేకపోవడం, ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ మొరటుగా ఆడే హాకీ, ఫుట్‌బాల్ లాంటి ఆట (కాంటాక్ట్ స్పోర్ట్) కాకపోవడం వల్ల సుకుమారులైన బ్రాహ్మణులు క్రికెట్ వైపు మొగ్గు చూపారన్నది ఆనంద్ సిద్ధాంతం. ఇందుకు విరుద్ధంగా మన హాకీ జట్టులో ఆదివాసీలు, దళితులు, సిక్కులు, వెనకబడిన తరగతులవారు ఉండడాన్ని కూడా అతను ఉదహరిస్తాడు. ఇదే రకంగా అమెరికాలో కూడా బాస్కెట్‌బాల్ జట్టులో అధికశాతం నల్ల జాతీయులు ఉంటే, బేస్‌బాల్ తెల్లవాళ్ళ ఆట అని కూడా అతను ప్రస్తావించాడు.

క్రికెట్ మొదటినుంచి కూడా రాజులు, నవాబులు, అగ్రవర్ణాల ఆటగానే ఉండేది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో భారత జట్టుకు రాజవంశీకులే నాయకత్వం వహించేవారు. వెస్టిండీస్ జట్టుకైతే 1960కి ముందు మూడు దశాబ్దాల పాటు తెల్లవాళ్ళే కెప్టెన్లుగా ఉన్నారు.  దక్షిణాఫ్రికాలో 80 శాతం మంది నల్లజాతీయులే ఉన్నా ఇప్పటివరకు ఏడుగురు నల్లనయ్యలు మాత్రమే ఆ దేశం క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోగలిగారు. భారత జట్టు ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టని రోజుల్లో పల్వంకర్ బాలూ అనే దళిత క్రికెటర్ అద్భుతమైన ప్రతిభ చూపి బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు కూడా స్పూర్తిగా నిలిచాడు. అతని అసాధారణ ప్రతిభను  గుర్తించి హిందూ జట్టులో ఆడనిచ్చారు కానీ లంచ్ టైంలో విడిగా భోజనం చేయాల్సి వచ్చేది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు తరఫున దళితులెవరూ ఆడిన దాఖలాలు లేవు. ముంబై క్రికెటర్లు ఏక్‌నాథ్ సోల్కర్, వినోద్ కాంబ్లీ దళితులని అంటారు కానీ కొందరు ముంబై వారే అది నిజం కాదంటారు. క్లోజ్ ఫీల్డర్‌గా విశేష ప్రతిభ చూపిన సోల్కర్ కులం ఏదైనా కావొచ్చు కానీ అతను కడు పేద కుటుంబంలో పుట్టడం వల్లనే ప్రమాదకరమైన ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. హెల్మెట్లు లేని రోజుల్లో బ్యాట్స్‌మన్‌కు అతి దగ్గరగా ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ స్థానంలో నిలుచోడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. “మిగతా ఆటగాళ్ళందరూ షార్ట్‌లెగ్ లో ఫీల్డింగ్ చేసే ప్రసక్తిలేదని తెగేసి చెప్పగలిగారు. కానీ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సోల్కర్ మాత్రం నో అనలేకపోయాడు” అని గవాస్కరే స్వయంగా చెప్పాడు. సాంఘిక హోదా క్రికెట్‌లో ఎంత ముఖ్యమన్నదానికి ఈ ఉదాహరణ చాలనుకుంటా.

అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. బహుశా ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులోకి ముంబై నుంచి, దక్షిణాది నుంచే ఎక్కువగా క్రికెటర్లు వచ్చేవారు కాబట్టి బ్రాహ్మణాధిపత్యం కనిపించేది. ఇప్పుడు దేశం నలుమూలలనుంచి క్రికెటర్లు పుట్టుకొస్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక కులమని కాదు గానీ అగ్రవర్ణాలదే మెజారిటీగా ఉంది. పరమేశ్వర్ ముండా అనే ఓ ఆదివాసి క్రికెటర్ జార్ఖండ్ రంజీ జట్టులో స్థానం సంపాదించుకోగలగడం మారుతున్న పరిస్థితులకు సంకేతం అనొచ్చు.

క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితి ఉంటే హాకీజట్టులో మాత్రం మొదటినుంచి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటూ మినీ ఇండియా లాగా కనిపిస్తుంది. 1928లో మొట్ట మొదటిసారి మన జట్టు హాకీలో ఒలింపిక్ స్వర్ణం గెలిచినప్పుడు జైపాల్ సింగ్ ముండా అనే ఆదివాసి భారత జట్టుకు నాయకుడిగా ఉండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. విలువిద్య లాంటి క్రీడల్లో ఆదివాసుల్ని ప్రోత్సహించడంతో లింబా రాం, దీపికా కుమారి లాంటి చాంపియన్లను తయారుచేసుకోగలిగాం. సామాజిక కోణంలో ఆలోచించి కొన్ని కొన్ని ప్రాంతాలు, కులాల ఆధారంగా క్రీడల్లో నైపుణ్యాలు పెంపొదించుకోవడంలో తప్పు లేదు. ఆర్మీలో కూడా సిక్కు రెజిమెంట్, జాట్ రెజిమెంట్ అని ఉంటాయి కదా. కుల పిచ్చి వేరే కుల ప్రస్తావన వేరేనని నెటిజన్లు గుర్తిస్తే మంచింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts