అమెరికాకు క్రికెట్ పిచ్చి అంటించేద్దామా?

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ ఒక పిచ్చి…వేలం వెర్రి. కారల్ మార్క్స్ మతం ఒక మత్తు మందు అన్నాడు కానీ క్రికెట్‌ను మించిన మత్తు మరొకటి లేదు. డ్రింకు, పొగాకు దీని ముందు దిగదుడుపే. ఇండియా మ్యాచ్ ఉందంటే పరీక్షలున్నా, ఆఫీసున్నా చూసితీరాల్సిందే. తప్పనిసరిగా బయటికెళ్ళాల్సి వచ్చినా పది నిముషాలకోసారి స్కోరు తెలుసుకోవాల్సిందే. మరి ఈ ఆట మత్తులో పట్టుమని పది దేశాలే పడ్డాయెందుకని? బ్రిటిష్ వారు తమ వలస రాజ్యాలని తెగ దోచేసుకుని ఇంగ్లీషు, క్రికెట్టు మనకు కానుకగా ఇచ్చివెళ్ళారు నిజమే కానీ బ్రిటిష్ వలసలు ఇంకా చాలా ఉన్నాయి కదా. వాటికి ఈ  ఆట అబ్బలేదెందుకని? పొరుగున ఉన్న చైనాకు గానీ, అగ్ర రాజ్యం అమెరికాకు గానీ ఈ పిచ్చి అంటుకోలేదే?

ప్రపంచం మొత్తంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్. పాప్యులారిటీలో రెండో స్థానం క్రికెట్‌దే. గమ్మత్తేమిటంటే ఈ రెండు ఆటల్ని అమెరికన్లు ఇష్టపడరు. 1990 లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పోటీలను అమెరికాలో అట్టహాసంగా జరిపారు. ఆ దెబ్బతో అగ్రరాజ్యం సోకర్ మోజులో పడుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఆమెరికన్లు ఇప్పటికీ బాస్కెట్‌బాల్, బేస్‌బాల్ క్రీడలనే ప్రేమిస్తున్నారు. వారికి ఫుట్‌బాల్ కూడా ఇష్టమే, కానీ అది అమెరికన్ రూల్స్ ఫుట్‌బాల్. దానికి మన సోకర్‌కి పోలికే లేదు.

ఒకప్పుడు అమెరికన్లు కూడా క్రికెట్ జోరుగా ఆడేవారు. ఎంతలేదన్నా వారు కూడా రెండున్నర శతాబ్దాల క్రితం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నవారే కదా. 1844 లో న్యూయార్క్ నగరంలోని బ్లూమింగ్‌డేల్ పార్క్‌లో అమెరికా కెనడాల మధ్య జరిగిన మ్యాచే మొట్ట మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అని చరిత్ర చెబుతున్నది. కానీ  1900 తర్వాత వేగంగా దూకుడుగా ఉండే బేస్‌బాల్ వైపు అమెరికన్లు మొగ్గు చూపారు. బేస్‌బాల్‌లో కూడ బ్యాట్, బంతి ఉంటాయి. షాట్ కొట్టి రన్ తీయడం ఉంటుంది. ఆ స్పీడ్ గేం ముందు క్రికెట్ వెలవెలబోయింది. ఆమెరికన్లకు ఓపిక తక్కువ. రోజుల తరబడి జరిగే క్రికెట్ ఆట ఆడే ఓపిక గానీ, చూసే తీరిక గానీ వారికి లేవు. ఆయిదు రోజులాడినా కూడా ఒక్కోసారి ఫలితం తేలని ఆట అని గేలి చేసేవారు. ఆయితే క్రికెట్‌ను ప్రేమించిన అమెరికన్లు కూడా లేకపోలేదు. మైక్ మార్కుసీ అనే అమెరికన్ రచయిత క్రికెట్ మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు. 1996 ప్రపంచ కప్ సందర్భంగా అతను భారత ఉపఖండంలో పర్యటించి రాసిన టూర్ డైరీ “వార్ మైనస్ ది షూటింగ్” క్రికెట్ సాహిత్యంలో ఓ క్లాసిక్‌గా నిలిచిపోతుంది. అలాగే ఇప్పుడొక హాలీవుడ్ దర్శకుడు ఓ క్రికెటర్ కథను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. మార్క్ సియార్డి అనే ఈ దర్శకుడు బేస్‌బాల్‌లో రాణించిన ఇద్దరు ప్రవాస భారతీయుల కథను ‘మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే సినిమాగా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఓ అమెరికన్ క్రికెటర్  ఐపిఎల్ లో చోటు దక్కించుకుంటే ఎలా ఉంటుందన్న సబ్జెక్టుతో సినిమా తీయాలనుకుంటున్నాడు.

ఇప్పటికే అరబ్ ఎమిరేట్స్, ఆఫ్ఘనిస్థాన్, హాలండ్ లాంటి దేశాలు  క్రికెట్‌ను అక్కున చేర్చుకున్నాయి కాబట్టి అమెరికాను కూడా ముగ్గులోకి దింపడానికి అంతర్జాతీయ క్రికెట్ ప్రాధికార సంస్థ ఐ.సి.సి ప్రయత్నిస్తున్నది. గ్లోబలైజేషన్ పేరుతో కిరాణా సరుకులతో సహా మన దేశంలో అన్ని వస్తువులూ గుమ్మరిస్తున్న అగ్ర రాజ్యానికి మనం క్రికెట్ పిచ్చి అంటించేస్తే కాస్తయినా తృప్తిగా ఉంటుంది. గతంలో కూడా చిన్న చిన్న ప్రయత్నాలు జరిగాయి కానీ అమెరికన్లను ఇంప్రెస్ చేయడం కుదర్లేదు. 1978 లో న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్‌లో గ్రేట్ గ్యారీ సోబర్స్ నాయకత్వంలో వాల్డ్ ఎలెవెన్ అమెరికన్ జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. గవాస్కర్, గ్రెగ్ చాపెల్, ఆండీ రాబర్ట్స్, టోనీ గ్రేగ్  లాంటి దిగ్గజాలు సోబర్స్ జట్టులో ఉన్నా వారు ఎలా ఓడిపోయారన్నది ఇప్పటికీ మిస్టరీనే! గతం గతహ..ఇప్పుడు క్రికెట్ కూడా కాలానుగుణంగా మారి, టి20 ఫార్మాట్ అమలులోకి వచ్చింది కాబట్టి ఈ స్పీడ్ గేం అమెరికన్లకు నచ్చుతుందన్న నమ్మకం కలుగుతున్నది. ఫైగా ఇప్పుడు అమెరికాలో ప్రవాస భారతీయులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు.  క్రికెట్‌తో అమెరికాను జయించడానికి ఇదే మంచి ఛాన్సు…

క్రితం ఏడాది నవంబర్‌లో సచిన్ తెండుల్కర్, షేన్ వార్న్ ఆధ్వర్యంలో ఆల్ స్టార్స్ పేరుతో మూడు వెటరన్ క్రికెటర్ల మ్యాచ్‌లు అమెరికాలో జరిగాయి. వీటికి విశేషాదరణ లభించింది. లాస్ ఏంజెలెస్,హూస్టన్, న్యూయార్క్ నగరాల్లో జరిగిన ఈ మ్యాచ్‌లను అరవైవేలమంది చూశారు.సచిన్, సెహ్వాగ్ లాంటి సూపర్‌స్టార్లను ప్రత్యక్షంగా చూడడానికి ప్రవాస భారతీయులు పోటీ పడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లు నలుచదరంగా ఉండే బేస్‌బాల్ మైదానాల్లో జరిగాయి. అమెరికాలో ఓ నికార్సయిన క్రికెట్ గ్రౌండ్ ఫ్లారిడాలోని లాడర్‌హిల్‌లో ఉంది.అక్కడ ఈ ఏడాది కేరిబియన్ లీగ్ పోటీలు కూడా జరిగాయి. అదే గ్రౌండ్‌లో ఈ మధ్యనే ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండు ట్20 మ్యాచ్‌లు జరిపారు. అవి కూడా సూపర్ హిట్. రెండు మ్యాచ్‌లకు స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. టీమిండియా మొదటిసారిగా అమెరికా గడ్డపై అధికారిక మ్యాచ్‌లు ఆడిన ఆ సందర్భం చాల ముఖ్యమైనది. పడమట క్రికెట్ రాగానికి అది గొప్ప సూచన. మిని ఐపిఎల్ పోటీలు కూడా అమెరికాలో జరపడానికి బిసిసీఇ సన్నాహాలు చేస్తున్నది.అమెరికా మార్కెట్‌ను అంచనా కట్టడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఆ దేశం పంపిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం ఇక మీదట ప్రతి ఏడాది అమెరికా గడ్డపై టీమిండియా టి20 ఇంటర్నేషనల్స్ ఆడనుంది. మరి రాజకీయ సూపర్ పవర్ కోటలో మన క్రికెట్ సూపర్ పవర్ పాగా వేయడానికి రంగం సిద్ధమైనట్టేనా?


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts