నా కూత‌కో లెక్కుంది…కామెంట్రీపై క్లారిటీ ఉంది

నచ్చితే షేర్ చేయ్యండి

నా ఆటైనా..మాటైనా సూటిగా ఉంటుంది
రిక‌మండేష‌న్ల‌కు నేను చాలా దూరం
నా ద‌గ్గ‌ర టాలెంట్ ఉంది కాబ‌ట్టే సెలెక్ట‌య్యా
నేను, నా భ‌ర్త క్రీడాకారులం కాబ‌ట్టి మంచి అండ‌ర్‌స్టాడింగ్ ఉంది
మా ఇద్ద‌రికి మా అమ్మాయే ఆద‌ర్శం
ఎక్స్‌ప‌ర్ట్‌తో పాటు కామెంట్రీ పెద్ద చాలెంజ్‌
స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి.వెంక‌టేష్ స‌హ‌కారం మ‌రువ‌లేనిది

1. ఎంబీఏ చేసిన అమ్మాయి…క‌బ‌డ్డీ కామెంట్రీతో చెడుగుడు ఆడేస్తుంది…?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : ఆటైనా..మాటైనా సూటిగా సుత్తిలేకుండా ఉండాల‌నేది నా ఆలోచ‌న‌. క‌బ‌డ్డీ అంటే ఇష్టం కాబ‌ట్టే..ఆ ఆట గురించి అంత‌లా చెప్ప‌గ‌ల్గుతున్నా. మ‌న దేశంలో పుట్టిన క‌బ‌డ్డీ ఇప్పుడు రూపు మార్చుకుంది. ఒలింపిక్స్‌కు క‌బ‌డ్డీ వెళ్తే మ‌రింత ఆనందం. అందులో నా భాగ‌స్వామ్యం ఉంటే మ‌రింత గౌర‌వంగా భావిస్తున్నా. ఇక విద్యార్హ‌త విష‌యానికొస్తే ఏంబీఏ చేయ‌డ‌మే కాదు, హెచ్ఆర్‌గా 15యేళ్ల అనుభ‌వం ఉంది. ప్ర‌స్తుతం సొంత‌గా మెడిక‌ల్ స్టాఫింగ్ కంపెనీని కూడా నిర్వ‌హిస్తున్నా.

2. క‌బ‌డ్డీపై ఆస‌క్తి….మీ నాన్న‌గారితో వ‌చ్చింది. మ‌రీ, కామెంట్రీపై ఇంట్రెస్ట్ ఎలా పెరిగింది…?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌ ఓ సంచ‌ల‌నం. క‌బ‌డ్డీ మ‌రో స్థాయికి వెళ్లాలంటే, అభిమానుల‌కు అది పూర్తిగా అర్థ‌మ‌వ్వ‌డ‌మే కాదు ఆద‌ర‌ణ కూడా పొందాలి. ఇంగ్లీష్‌, హిందీ కామెంట్రీ విన‌డం నా అల‌వాటు. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. ప్లేయ‌ర్‌గా ఉన్న అనుభ‌వంతో వ్యూయ‌ర్స్‌కు ఆట గురించి మెరుగ్గా చెప్ప‌గ‌ల్గుతున్నా. ఇంగ్లీష్‌, హిందీ కామెంట్రీ విన‌డం వ‌ల్ల ప్ర‌తిక్ష‌ణం అప్‌డేట్ అవుతుంటా.

3. కామెంట్రీలో మీరు ఎవ‌రినైనా ఆద‌ర్శంగా తీసుకున్నారా..? ఫ‌స్ట్ అనుభ‌వం ఏంటి…?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : హ‌ర్షాభోగ్లే కామెంట్రీలో ఆద‌ర్శం. క‌బ‌డ్డీలో ప‌ద‌మ్‌జీత్ షెరావ‌త్‌, సుహైల్‌, సునీల్ త‌నేజా, సంజ‌య్ బెన‌ర్జీ లాంటి వాళ్ల కామెంట్రీ చాలా ఇష్టం. స్టార్ స్పోర్ట్స్ నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌లో అమ్రిత‌, ఎన్‌పీ సింగ్ ఇచ్చిన స‌హ‌కారం మ‌రువ‌లేనిది. స్వ‌తాహాగా ఇంగ్లీష్ మీడియం కావ‌డంతో…తెలుగులో మాట్లాడేందుకు, ప‌దాల‌ను అల్లుకునేందుకు స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి. వెంక‌టేష్ గారు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు.

4.మీరు…ఎక్స్‌ప‌ర్ట్‌గా కూడా ఉన్నారు. ఎలాంటి ప్రిప‌రేష‌న్ చేయాల్సి వ‌స్తోంది…?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : కామెంట్రీతో పాటు, ఎక్స్‌ప‌ర్ట్‌గా కూడా నాపై ఎక్కువ బాధ్య‌త ఉంది. అందుకే, ప్రిప‌రేష‌న్‌తోనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తా. ఒక మ్యాచ్‌పై పూర్తి ఎనాల‌సిస్ చేసేముందు హోంవ‌ర్క్ చేయ‌క‌పోతే ఇబ్బందే. అందుకే, ఎక్స్‌ప‌ర్ట్‌గా, కామెంటేట‌ర్‌గా ప్రిప‌రేష‌న్‌తోనే ముందుకెళ్తా. ఇందులో స‌హ‌క‌రించిన శాస్త్రి, శ్రీధ‌ర్‌రావుతో ప్ర‌జెంట్ ఉన్న మీ టీమ్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

5. మీ భ‌ర్త కోచ్‌…మీరు కామెంటేట‌ర్ ఎలా ఉంది జ‌ర్నీ…?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌తో…క‌బ‌డ్డీ లైఫ్‌కి ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. మా వారితో (హ‌ర్యానా స్టీల‌ర్స్ అసిస్టెంట్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి) పాటు, నాకూ ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో అవ‌కాశాలు రావ‌డ‌మే కాదు, ఆట‌తో మా అనుబంధాన్ని కొన‌సాగేలా చేసింది. అంతేకాదు…ప్ర‌త్యేక గుర్తింపు కూడా ద‌క్కింది. ఈ విష‌యంలో క‌బ‌డ్డీ ఫెడ‌రేష‌న్‌తో పాటు, స్టార్ స్పోర్ట్స్ గ్రూప్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి.

6. ఆయ‌న స‌హ‌కారం వ‌ల్లే…మీకు ఈ చాన్స్ వ‌చ్చింద‌నే కామెంట్స్‌పై మీరేమంటారు..?

రాధిక శ్రీనివాస్ రెడ్డి :  ” confidence is silent and insecurity is loud” అనే సామెత గుర్తొస్తుంది మీరు ఈ ప్ర‌శ్న అడుగుతుంటే. ఎవ‌రికైనా అవ‌కాశాలు ఊరికే రావు. ఎవ‌రో ఒక‌రు రిఫ‌ర్ చేయాల్సిందే త‌ప్ప రిక‌మండ్ చేయ‌రు. అయితే, నీలో సామ‌ర్థ్యం లేన‌ప్పుడూ ఎవ‌రూ రిఫ‌ర్ చేయ‌రు. అంతేకాదు..నా కామెంట్రీలో విష‌యం లేక‌పోతే, ఇన్ని సీజ‌న్లు చెప్పేదానిని కూడా కాదు. నాలో ఉన్న న‌మ్మ‌కమే న‌న్ను ముందుకు న‌డిపించింది. తాము చేసే ప‌నిపై 100శాతం శ్ర‌ద్ధ పెట్ట‌లేని వాళ్లే ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తారు. ఇలాంటి అర్థంలేని మాట‌ల‌తో నా కాన్ఫిడెన్స్ లెవ‌ల్‌ను త‌క్కువ చేయ‌లేరు. అలాగే వెనుక మాట్లాడేవాళ్ల‌ గురించి నేను ప‌ట్టించుకోను. కోట్లాదిమంది వింటున్నారు..వాళ్ల‌కు తెలుసు నేనెంటో. రిక‌మండేష‌న్‌తో వ‌చ్చి ఉంటే ఇన్ని రోజులు ఈ ఫీల్డ్‌లో కొన‌సాగే దాన్ని మాత్రం కాదు. ఎవ‌రూ కొన‌సాగ‌లేరు కూడా.

radhika family

7. మీరు ఇంగ్లీష్ మీడియం..కానీ తెలుగులో కామెంట్రీ అద‌ర‌గొడుతున్నారు..?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : ఇంగ్లీష్ మీడియంలో చ‌దువుకున్నా..మాతృభాష తెలుగే. నా ఆలోచ‌న కూడా ఇంగ్లీష్ స్ట‌యిల్లోనే ఉంటుంది. తెలుగులో కామెంట్రీ అన్న‌ప్పుడు కాస్త ఇబ్బందిప‌డ్డా. అందులో ప్రావీణ్యం సాధించేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డా. స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి.వెంక‌టేష్ గారు చాలా స‌హ‌క‌రించారు. న‌మ్మ‌రు కానీ, వారం రోజులో 60 మ్యాచ్‌ల‌కు ఒక్క‌దాన్నే తెలుగులో కామెంట్రీ ప్రాక్టీస్ చేశా. ఏ రోజుకారోజు..కామెంట్రీలో ఉన్న‌సందేహాల‌ను సీనియ‌ర్స్‌ని అడిగి క్లారిఫై తీసుకునేదాన్ని. ఈ విష‌యంలో నా భ‌ర్త బాగా స‌హ‌క‌రించారు.

8. ఐదో ఎడిష‌న్ షెడ్యూల్ చాలా పెద్ద‌ది..? కామెంటేట‌ర్‌, ఎక్స్‌ప‌ర్ట్‌గా ఎలా రాణిస్తున్నారు. ?

రాధిక శ్రీనివాస్ రెడ్డి :  ఈ సీజ‌న్ ప్ర‌తి కామెంటేట‌ర్‌కి పెద్ద స‌వాల్‌. సీజ‌న్‌లోకి కొత్త ప్లేయ‌ర్స్ రావ‌డం, ఫార్మాట్ కొత్త‌గా ఉండ‌టంతో..ప్ర‌తి దానిపైనా కాస్త గ‌ట్టిగానే హార్డ్ వ‌ర్క్ చేయాల్సి వ‌చ్చింది. ఇక‌, ఎక్స్‌ప‌ర్ట్‌గానూ ఈ సీజ‌న్ మ‌రో స‌వాల్‌. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయ‌డానికి గ‌త సీజ‌న్ల కంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. ఏదైనా..క‌బ‌డ్డీ కోస‌మే కాబ‌ట్టి ఇష్టంగానే ముందుకెళ్తున్నా.

9. మీ వారు కోచ్‌గా, మీరు కామెంటేట‌ర్‌గా చాలా రోజులు ఇంటికి దూరంగా ఉంటున్నారు. వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఎలా మ్యానేజ్ చేస్తున్నారు.

రాధిక శ్రీనివాస్ రెడ్డి : ఇద్ద‌రం స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి వాళ్లం కాబ‌ట్టి…మాకు ముందే తెలుసు వ్య‌క్తిగ‌త జీవితాన్ని మిస్ అవుతామ‌ని. ప్ర‌తి క్రీడాకారుడికి ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌జెంట్ టెక్నాల‌జీ పెర‌గ‌డం వ‌ల్ల‌, దూరంగానే ఉన్నా కాస్త ద‌గ్గ‌ర‌గానే ఉన్న‌మ‌నే భావ‌న క‌ల్గుతుంది. అయితే, మా అమ్మాయికి దూరంగా ఉండ‌టం కాస్త బాధ క‌ల్గిస్తుంది. అయితే, చిన్న‌దైనా త‌ను మ‌మ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తుంది. ఫ్యూచ‌ర్‌లో మా పాప కూడా స్పోర్ట్స్‌లో రాణించాల‌నుకుంటుంది కాబ‌ట్టి ఈ వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డుతుంది. అయితే, సీజ‌న్లో మ‌ధ్య‌లో వ‌చ్చిన హాలీడేస్ కాస్త ఊర‌ట క‌ల్గించేది.

10. తొటి కామెంటేట‌ర్స్‌తో మీ జ‌ర్నీ ఎలా ఉంది…?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : కామెంట్రీ అంటేనే టీమ్ వ‌ర్క్‌. ప్రొఫెష‌న‌ల్ రిలేష‌న్ అంద‌రితో ఉంది. నా నుంచి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తా. మా టీమ్ ముందుండాల‌ని కోరుకుంటా.

11. కామెంటేట‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ఆలోచ‌న‌లు మొద‌ల‌య్యాయి…?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : చాన్స్ వ‌చ్చిన‌వెంట‌నే నాకు వ‌చ్చిన ఆలోచ‌న..వ్య‌క్తిగ‌తంగా నాకంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకోవాల‌ని. ఇప్ప‌టికైతే ఆ పేరు సాధించాన‌ని అనుకుంటున్నా. ఆట‌లోనైనా, మాట‌లోనైనా మ‌న‌కంటూ ఓ ఇమేజ్ ఉండాల‌నేది నా ఫీలింగ్‌

12. మీ టార్గెట్ ఏంటి..? మీ కామెంట్రీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌తో ఎలా ముందుకెళ్లాల‌నుకుంటున్నారు..?

రాధిక శ్రీనివాస్ రెడ్డి : ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీని చూడాలి. క‌బ‌డ్డీతో పాటు నేను కూడా వ్య‌క్తిగ‌తంగా ముందుకెళ్లాలి. వీలుంటే…మిగిలిన ఆట‌ల్లో కూడా నా గొంతు వినిపించాల‌ని కోరుకుంటున్నా.

వెంక‌ట్ రేగ‌ళ్ల‌
సీనియ‌ర్ స్పోర్ట్స్‌క‌ర‌స్పాండెంట్‌
న్యూస్ టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌
9966691192


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts