క‌బ‌డ్డీ కామెంటేట‌ర్ మాధ‌వి బండారి ఇంట‌ర్వ్యూ

నచ్చితే షేర్ చేయ్యండి

క‌బ‌డ్డీ తొలి తెలుగు కామెంటేట‌ర్ కావ‌డం అదృష్టం
ఇండియ‌న్ స్పోర్ట్స్‌లో ప్రో క‌బ‌డ్డీ ఓ సంచ‌ల‌నం
ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీ చూడాల‌నేదే కోరిక‌
కోచ్‌గా అవ‌కాశ‌మిస్తే స‌త్తా చాటుతా
పిల్ల‌ల‌పై ఇష్టాలు రుద్ద‌లేదు..వాళ్ల లైఫ్ వాళ్లిష్టం

1. క‌బ‌డ్డీ కూత‌కు….మీ మాట‌లు..చ‌ప్ప‌ట్ల మోత మోగిస్తున్నాయి. ఎలా ఉంది అనుభ‌వం..?

మాధ‌వి : చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆట‌ను మాట‌ల్లో చెప్ప‌డం ఓ స‌రికొత్త అనుభూతి.
2. తొలి తెలుగు మ‌హిళా కామెంటేట‌ర్ మీరు. నాల్గు సీజ‌న్లుగా ఎలాంటి స్పంద‌న ల‌భిస్తోంది…?

మాధ‌వి : ఆద‌ర‌ణ అద్భుతం. ఎక్క‌డికి వెళ్లినా జ‌నాలు గుర్తిస్తున్నారు. ఓ సారి బ‌స్‌లో వెళ్తున్న టైమ్‌లో నా గొంతు విని, ఒక‌యాన సీటు ఇచ్చారు. అప్పుడే నాకు తెలిసింది…మా మాట‌ల‌న్ని జ‌నాలు ఎంత‌లా ఫాలో అవుతున్నారోన‌ని.

3. క‌బ‌డ్డీ ఇలా మెరిసిపోతుంద‌నుకున్నారా..? మీరు ఇలాంటి రోల్ ప్లే చేయాల్సి వ‌స్తుంద‌నుకున్నారా..?

మాధ‌వి : అనుకోలేదు కానీ, అవాల‌ని కోరిక మాత్రం ఉండేది. ఆ క్రెడిట్ అంతా స్టార్ స్పోర్ట్స్‌దే. క‌బ‌డ్డీని ఈ స్థాయిలో వాళ్లు ప్రొత్స‌హించ‌డం, న‌న్ను వాళ్లు గుర్తించి అవ‌కాశాలు ఇవ్వ‌డం మ‌రిచిపొలేని విష‌యాలు. అంతేకాదు, నాకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును కూడా తీసుకువ‌చ్చింది స్టార్ గ్రూప్‌.

4. కామెంట్రీలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయి..?

మాధ‌వి : చాలా చురుగ్గా ఉండాలి. ఒక సెకండ్ పాటు కూడా మ‌న‌సు, మైండ్ అటూ, ఇటూ వెళ్లొద్దు. అలా ఏకాగ్ర‌త‌తోనే ఉన్నాను కాబ‌ట్టే…వ్యూయ‌ర్స్‌కి త్వ‌ర‌గా నా వాయిస్ క‌నెక్ట్ అయ్యింద‌ని భావిస్తున్నా.

5. ప్లేయ‌ర్ నుంచి…కామెంటేట‌ర్‌గా క‌బ‌డ్డీతో జ‌ర్నీ ఎలా అనిపిస్తుంది

మాధ‌వి : నేను ఎప్పూడూ నా ఆట‌ను ప్రేమించేదాన్ని. క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌న‌ని చెప్పుకోవ‌డానికి గ‌ర్వంగా ఫీల‌య్యేదాన్ని. క‌బ‌డ్డీపై ఉన్న ప్రేమ‌, గౌర‌వం వ‌ల్లే ఇవాళ ఇలాంటి పొజిష‌న్‌లో ఉన్నా. ప్లేయ‌ర్ లేదా కోచ్ లేదా కామెంటేట‌ర్‌గా….ఏ వ‌ర్క్ చేసినా 101శాతం ఔట్‌పుట్ ఇస్తాను

6. మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్‌

మాధ‌వి : తెలుగులో వ్యాఖ్యానం చేయ‌డం వ‌ల్ల ఎక్కువ మందికి క‌బ‌డ్డీ గురించి తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. శాస్త్రీయంగా కూడా వివ‌రించ‌డం వ‌ల్ల‌, క‌బ‌డ్డీలోని టెక్నిక‌ల్ అంశాల‌పై అవ‌గాహ‌న వ‌స్తుంది. ప్లేయ‌ర్‌లోని టెక్నిక‌ల్ గేమ్‌పై అభిమానుల‌కు తెలుస్తుంది. కామెంట్రీ వింటున్న వాళ్ల‌లో చాలా మంది రోజు రోజు కొత్త విష‌యాలు తెలుసుకుంట‌న్నార‌ని ధీమాగా చెప్ప‌గ‌ల‌ను.

7. ఫ్యామిలీ స‌పోర్ట్ గురించి మీరేమంటారు

మాధ‌వి : క‌బ‌డ్డీలో డిఫెన్స్ ఎలా అయితే వెన్నెమూక‌గా ఉంటుందో అలాగే, ఈ కెరీర్‌లో నా ఫ్యామిలీయే కీల‌కం. వాళ్లు ఇచ్చిన స‌హ‌కారం మ‌రువ‌లేనిది. ముఖ్యంగా నా భ‌ర్త న‌న్ను బాగా ఎంక‌రేజ్ చేశారు. పిల్ల‌లిద్ద‌రూ….నా జ‌ర్నీలో కీల‌క రోల్ ప్లే చేశారు.

8. అస‌లు..మీకు క‌బ‌డ్డీలో స్ఫూర్తి ఎవ‌రు..? కామెంట్రీలో ఎవ‌రిని ఆద‌ర్శంగా తీసుకున్నారు

మాధ‌వి : క‌బ‌డ్డీలో స్ఫూర్తి అంటూ ఎవ‌రూ లేరు. చిన్న‌ప్ప‌టి నుంచి ఆడ‌టం మొద‌లుపెట్టా. ఆట‌ను ఎక్కువ‌గా ఆస్వాదించా. జాతీయ స్థాయిలోకి వెళ్లాకా…బెంగాల్‌కి చెందిన అర్జున అవార్డీ రొమా స‌ర్కార్‌లా ఆడాల‌నుకునే దాన్ని. కామెంట్రీలో ఎలాంటి అనుభ‌వం లేదు. స్టార్ గ్రూప్ నిర్వ‌హించిన కొన్ని వ‌ర్క్‌షాప్‌తో నాలోనూ ఓ కామెంటేట‌ర్ ఉంద‌నే విష‌యం అర్థ‌మైంది. నేర్చుకోవ‌డం ఇష్టం కావ‌డంతో…ఇందులోనూ రాణించ‌గ‌లిగాను.

9. తొటి కామెంటేట‌ర్ల‌తో మీ స్నేహాం..?

మాధ‌వి : అంద‌రిలో చ‌క్క‌టి అనుబంధం ఉంది. ఉండాలి కూడా. అప్పుడే…కో ఆర్డినేష‌న్ బావుంటుంది. ఆ టైమ్‌లోనే ఔట్‌పుట్ బాగుంటుంది. ఏదీ ఏమైనా…టీమ్ వ‌ర్క్ చాలా అవ‌స‌రం.

10. ఫ్యూచ‌ర్ కామెంటేట‌ర్స్‌కు మీరిచ్చే స‌ల‌హా…?

మాధ‌వి : ఆట‌తో ఎప్పుడూ అనుబంధం పెంచుకుంటూ ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యూలేష‌న్ గురించి అప్‌డేట్‌గా ఉండాలి. ఏ ప‌ని చేసినా..ఇష్టంగా చేయాలి. ప్యాష‌న్‌కి తోడుగా…హార్డ్‌వ‌ర్క్ ఉంటే విజ‌యం మీ వెంటే వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహాం లేదు.

11. ప్లేయ‌ర్‌గా ఉన్న మీరు…కామెంటేట‌ర్‌గా, ఆ త‌ర్వాత ఎక్స్‌ప‌ర్ట్‌గా మారారు. మీ ల‌క్ష్యం ఏంటి..?

మాధ‌వి : ప్లేయ‌ర్‌గా కెరీర్ ముగిసింది. ఇక మిగిలింది కోచ్‌గా మార‌డ‌మే. అవ‌కాశం వ‌స్తే….కోచ్‌గా ప‌నిచేసేందుకు సిద్ధం. తెలుగులో కామెంట్రీ ఎన్ని రోజులుంటే..మాధ‌వి బండారి స్వ‌రం వినిపించాలి. అన్నిటి కంటే ముఖ్యంగా…ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీని చూడాలి.

12. మీరు మాత్ర‌మే క‌బ‌డ్డీకి ప‌రిమిత‌మ‌య్యారు..మీ పిల్ల‌ల‌ను ఎందుకు అటువైపు తీసుకెళ్లలేదు..?

మాధ‌వి : పిల్ల‌లిద్ద‌రూ…స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గానే ఉన్నారు. నేను, మా వారు ఎప్పుడూ వాళ్ల‌పై మా ఇష్టాల‌ను రుద్ద‌లేదు. మా అబ్బాయి బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్‌, అమ్మాయి..టెన్నిస్ ఆడుతుంది. సెంట్ర‌ల్ స్కూల్లో చ‌దువుకోవ‌డంతో వాళ్ల‌కి స్పోర్ట్స్‌తో చ‌క్క‌టి అనుబంధం ఉంది. అయితే, క‌బ‌డ్డీ లేక‌పోవ‌డంతో ఆ గేమ్ ఆడ‌లేదు. అయితే, కేబీడీ జూనియ‌ర్స్ చిన్నారులంద‌రికి మంచి అవ‌కాశం. ఈ విష‌యంలో స్టార్‌స్పోర్ట్స్‌ను అభినందించాల్సిందే.

13. క‌బ‌డ్డీ త‌ల‌రాత మారింద‌నుకుంటున్నారా…?

మాధ‌వి : క‌బ‌డ్డీకి గుర్తింపు రావ‌డంతో…ఆట‌గాళ్ల‌కి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆట‌ మ‌ట్టి నుంచి మ్యాట్‌పైకి వ‌చ్చింది. ఔట్‌డోర్ నుంచి ఇండోర్ ఆట‌గా మారింది. టెక్నాల‌జీ ఆట‌లో కీల‌కంగా మారింది. నిబంధ‌న‌ల్లో కూడా మార్పులు వ‌చ్చాయి. కాబ‌ట్టి ఈ ఆట‌పై అభిమానుల్లో విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. అంద‌రికి ఈ ఆట‌తో అనుబంధం ఉంది. భ‌విష్య‌త్‌లో మ‌రింత‌గా క‌బ‌డ్డీ అభివృద్ధి చెందుతుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.

– వెంక‌ట్ రేగ‌ళ్ల‌
సీనియ‌ర్ స్పోర్ట్స్ క‌ర‌స్పాండెంట్‌
న్యూస్ టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts