వ‌రుణుడి సాక్షిగా తొలి టీట్వంటీ మ‌న‌దే

నచ్చితే షేర్ చేయ్యండి

రాంచి టీట్వంటీలో టీమిండియా విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియాతో ప్రారంభ‌మైన మూడు టీట్వంటీ సిరీస్‌లో, ఫ‌స్ట్ మ్యాచ్‌లో టీమిండియా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో గెలిచింది. వ‌ర్షం కీల‌క టైమ్‌లో అంత‌రాయం క‌ల్గించ‌డంతో ఆసీస్ పూర్తి ఓవ‌ర్లు ఆడ‌కుండానే ఇన్నింగ్స్ ముగిస్తే, భార‌త్ ఆరు ఓవ‌ర్ల‌లో 48ప‌రుగుల ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా ఛేధించింది. కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్ విక్ట‌రీలో కీల‌క రోల్ ప్లే చేశారు.

ఆరంభం నుంచి భార‌త్‌దే దూకుడు

టాస్ గెలిచిన భార‌త్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్మిత్ లేక‌పోవ‌డంతో సార‌ధ్య బాధ్య‌త‌లు తీసుకున్న వార్న‌ర్‌….ఆరంభంలో రెండు ఫోర్లు కొట్టి జోరు ప్ర‌ద‌ర్శించాడు. అయితే, భువ‌నేశ్వ‌ర్ ఆ దూకుడిని ఎక్కువ సేపు కొన‌సాగ‌నీయ‌లేదు. వికెట్ల ద‌గ్గ‌ర వార్న‌ర్ దొర‌క‌బ‌ట్ట‌డంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మాక్స్‌వెల్‌, ఫించ్ కాసేపు నిల‌బ‌డ్డారు.

స్పిన్న‌ర్ల ఎంట్రీతో మారిన సీన్‌

స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మ‌రోసారి ఆసీస్ త‌డ‌బ‌డింది. ఆదుకుంటాడ‌నుకున్న మాక్స్‌వెల్‌ను చాహ‌ల్ మ‌రోసారి బొల్తాకొట్టించాడు. అత‌ని బౌలింగ్‌లో ఈ టూర్‌లో మాక్స్‌వెల్ ఔట్ కావ‌డం నాల్గోసారి. ఆ త‌ర్వాత బౌలింగ్‌కు దిగిన కుల్దీప్‌, ఫామ్‌లో ఉన్న ఫించ్‌ను, ఆ వెంట‌నే హెన్రిక్స్‌ను ఔట్ చేశాడు. రాణిస్తాడ‌నుకున్న హెడ్‌ను పాండ్యా ఔట్ చేస్తే, బూమ్రా ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీయ‌డంతో ఆసీస్ ఒక్క‌సారిగా డీలాప‌డింది. ఈ టైమ్‌లో వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్ దాదాపు గంట‌న్న‌ర‌సేపు ఆగింది. ఆ టైమ్‌లో ఆసీస్ 8వికెట్లు కోల్పోయి 118ప‌రుగులు చేసింది.

డ‌క్‌వ‌ర్త్‌లో భార‌త్ టార్గెట్ 48

వ‌ర్షం ఆగిన త‌ర్వాత ప్రారంభ‌మైన మ్యాచ్‌లో భార‌త్ ల‌క్ష్యాన్ని 48ప‌రుగులుగా నిర్థారించారు అంపైర్లు. ఛేజింగ్‌లో రోహిత్ సిక్స్‌, ఫోర్‌తో స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించాడు. అయితే, కౌల్ట‌ర్‌నైల్ వేసిన బాల్‌కు వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్‌తో క‌లిసి మిగిలిన ప‌రుగులు సాధించి జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts